అమ్మ ఆదర్శ పాఠశాలల బిల్లులు రిలీజ్

  • బడుల రినోవేషన్ వర్క్స్ కంప్లీట్
  • రూ.11.80 కోట్లు రిలీజ్
  • గత సర్కార్  హయాంలో మన ఊరు- మన బడి 
  • రూ. 4 కోట్ల బిల్లులు పెండింగ్

రాజన్నసిరిసిల్ల, వెలుగు: అమ్మ ఆదర్శ పాఠశాలల్లో రినోవేషన్ పనుల బిల్లులు మంజూరయ్యాయి. జిల్లాలో 283 పాఠశాలల్లో  పనులకు 210 బడుల్లో పనులు పూర్తి చేశారు. ఈ పనులకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు సంబంధించి  రూ. 11.80 కోట్ల బిల్లులు మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సర్కార్ బడుల బలోపేతం కోసం ఈ ఏడాది ఏప్రిల్ లో  ‘అమ్మ ఆదర్శ కమిటీ’ల పేరిట కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ  కమిటీల ద్వారా జిల్లాలోని 283 ప్రభుత్వ పాఠశాలలను  మొదటి విడతలో ఎంపిక చేసింది. 

ఈ పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేసేందుకు టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు పనులు అప్పజెప్పారు. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేశారు.  గత నెలలో 210 పాఠశాలలకు సంబంధించిన పనులు కుకింగ్​ షెడ్లు, టాయిలెట్స్,  డ్రింకింగ్  వాటర్, మేజర్ మైనర్ రిపేర్స్, అడిషనల్ క్లాస్ రూమ్స్,  ఇతర తరగతి గదుల రినోవేషన్ లాంటి పనులు చేపట్టారు.  దీంతో  బడుల ముఖ చిత్రం మారిపోయింది.  టాయిలెట్స్, తరగతి గదుల పెయింటింగ్స్ బడులు సర్వాంగ సుందరంగా తయారయ్యాయి. వీటి కోసం రూ. 11.80 కోట్లు మంజూరు చేశారు.  మిగితా పాఠశాలల బిల్లులను సైతం ప్రభుత్వానికి ఆఫీసర్లు నివేదిక పంపారు. త్వరలోనే ఇవి కూడా సాంక్షన్ అవుతాయని చెప్తున్నారు. 

గత ప్రభుత్వంలో పెండింగ్ లోనే బిల్లులు

గత ప్రభుత్వం 'మన- ఊరు మనబడి' కార్యక్రమం చేపట్టిన బిల్లులు గత సర్కార్ పెండింగ్ లోనే పెట్టింది. ఈ కార్యక్రమం కింద 172 పాఠశాలలను ఎంపిక చేశారు. ఇందులో సగం పాఠశాలల్లో పనులు పూర్తి కాలేదు. గత సర్కార్ సకాలంలో బిల్లులు మంజూరు చేయకపోవడంతో గుత్తేదారుల పనులు మధ్యలోనే ఆపేశారు.  ఫర్నీచర్, గ్రీన్ చాక్ పీస్ బోర్డు, హెచ్ అండ్ టీచర్లు ఫర్నీచర్,  విద్యార్థులకు డ్యూయల్ డెస్క్ లు, పెయింటింగ్స్,  డైనింగ్ హాల్స్ లాంటి పనులు చేపట్టారు. 16 డైనింగ్ హాల్స్  పూర్తయ్యాయి. మిగితావి పెండింగ్ లోనే ఉన్నాయి.  చేసిన పనులకు  జిల్లాలో రూ. 4 కోట్లు గత ప్రభుత్వం  
పెండింగ్ లోనే  పెట్టింది. 

మన ఊరి మన బడి కార్యక్రమంలో భాగంగా కోనరావుపేట మండలం ధర్మారం ప్రభుత్వ పాఠశాలలో గత ప్రభుత్వ హయాంలో  3 లక్షల 80 వేల తో ఏడాదిన్నర క్రితం కిచెన్ షెడ్డు నిర్మించాను. ఇందులో లక్షా 60 వేలు మాత్రమే బిల్లు వచ్చింది. అప్పులు తీసుకొచ్చి కిచెన్ షెడ్ నిర్మించాను. ఇంతవరకు బిల్లులు రాక , అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదు. మిత్తిలు కట్టలేక తీవ్ర అవస్థలు పడుతున్నాను. ఇప్పటికైనా అధికారులు తన బిల్లును ఇప్పించే ఆదుకోవాలని కోరుతున్నాను.ఇప్పరాములు, ధర్మారం, కోనరావుపేట