పేరుకే వంద పడకలు

  • దయనీయ స్థితిలో బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్
  • ఓపెన్ చేసి రెండేండ్లవుతున్నా 30 బెడ్స్​కే పరిమితం
  • వేధిస్తున్న డాక్టర్లు, సిబ్బంది కొరత 
  • అన్ని రకాల సేవలు, బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని రోగుల డిమాండ్

బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్​ను 30 బెడ్స్ నుంచి 100 పడకలుగా అప్​గ్రేడ్ చేసినా అది కాగితాలకే పరిమితమైంది. రెండేండ్లుగా 30 పడకలతోనే కొనసాగుతోంది. గత బీఆర్​ఎస్​సర్కారు కోట్ల రూపాయల ఖర్చు చేసి బెల్లంపల్లిలో ఆస్పత్రి బిల్డింగ్ కట్టించి అట్టహాసంగా ఓపెనింగ్ చేసింది. కానీ హాస్పిటల్​లో అవసరమైన డాక్టర్లను, సిబ్బందిని నియమించలేదు. ఫలితంగా ఆస్పత్రిని ప్రారంభించి రెండేండ్లు అవుతున్నా 30 బెడ్స్​కే పరిమితమైంది. డాక్టర్లు, సిబ్బంది సరిపడా లేకపోవడంతో ఏషెంట్లకు అరకొర సేవలు అందుతున్నాయి. అత్యవసర సమయాల్లో ఇక్కడి ప్రజలు మంచిర్యాలకు పోవాల్సిన పరిస్థితి 
నెలకొంది. 

34 మందికి 8మంది డాక్టర్లే..

ఏరియా హాస్పిటల్​లో మొత్తం 34 మంది డాక్టర్లు ఉండాల్సిన చోట ప్రస్తుతం కేవలం 8 మంది మాత్రమే ఉన్నారు. వీరిలో ఆరుగురు రెగ్యులర్ డాక్టర్లు కాగా, మరో ఇద్దరు డిప్యూటేషన్​పై పనిచేస్తున్నారు. స్టాఫ్ నర్సులు 40 మంది ఉండాల్సిన చోట 10 మందే పనిచేస్తున్నారు. వీరిలో నలుగురు డిప్యుటేషన్​పై వచ్చారు. నలుగురు గైనికాలజిస్టులకు ఒక్కరు, ముగ్గురు పీడియాట్రీషియన్లకు ఒక్కరే ఉన్నారు. గతంలో ముగ్గురు గైనికాలజిస్టులు ఉన్నప్పుడు నెలకు 200 వరకు డెలివరీలు జరిగేవి. ప్రస్తుతం 70 డెలివరీలు మాత్రమే అవుతున్నాయి. అత్యవసర సమయాల్లో పేషెంట్లను మంచిర్యాల గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్​కు రెఫర్ చేస్తున్నారు. 

పెరుగుతున్న రోగుల తాకిడి

బెల్లంపల్లి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్​కు రోజురోజుకు రోగుల తాకిడి పెరుగుతోంది. ప్రస్తుతం రోజుకు 450 నుంచి 500 ఓపీ, 100 నుంచి 120 వరకు ఐపీ కేసులు వస్తున్నాయి. పేషెంట్లతో హాస్పిటల్ కిటకిటలాడుతున్నప్పటికీ సరిపడా డాక్టర్లు, నర్సులు, సిబ్బంది లేకపోవడంతో సరైన వైద్యం అందడం లేదు. బెల్లంపల్లి టౌన్, రూరల్, కాసిపేట, నెన్నెల, భీమిని, కన్నెపల్లి, మందమర్రి ప్రాంతాల ప్రజలు బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్​కు వైద్యం కోసం వస్తుంటారు. ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్, కాగజ్​నగర్, ఆసిఫాబాద్, దహెగాం, పెంచికలపేట, బెజ్జూర్, కౌటాల మండలాల నుంచి అక్కడి డాక్టర్లు రోగులను బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్​కు రెఫర్ చేస్తున్నారు. కానీ, ఇక్కడ వైద్య నిపుణులు, వైద్య సిబ్బంది లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

కావాల్సిన సౌకర్యాలు  

సిటీ స్కాన్, ఎమ్మారై స్కానింగ్, టూడీ ఈకో, బ్లడ్ బ్యాంక్ వంటి సౌకర్యాలను ఏర్పాటు చేయాలని పేషెంట్లు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఈఎన్టీ, ఐ స్పెషలిస్ట్, న్యూరో, కార్డియో, గైనిక్, చెస్ట్, జనరల్ మెడిసిన్, స్పెషలిస్టులను నియమిస్తే మెరుగైన ట్రీట్​మెంట్ అందే అవకాశాలు ఉంటాయి. ఈ విషయంపై వైద్య విధాన పరిషత్ అధికారులు, కలెక్టర్ స్పందించాలని కోరుతున్నారు.

మంత్రికి సమస్యలు విన్నవించా.. 

బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్​లో నెలకొన్న సమస్యలను రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా దృష్టికి తీసుకెళ్లాను. 100 బెడ్స్ ఏర్పాటు చేయడంతోపాటు అందుకు అవసరమైన డాక్టర్లను, స్టాఫ్​ను నియమించాలని కోరాను. త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి చర్యలు తీసుకుంటున్నాం.
- గడ్డం వినోద్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే