బ్యాంకింగ్‌‌ సెక్టార్‌‌‌‌కు లక్ష కోట్ల లాభం!

బ్యాంకింగ్‌‌ సెక్టార్‌‌‌‌కు లక్ష కోట్ల లాభం!

బిజినెస్‌‌‌‌డెస్క్‌‌‌‌, వెలుగు:  కరోనా వలన ఎకానమీ చిన్నాభిన్నం అయినా, బ్యాంకింగ్‌‌‌‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌ మాత్రం దుమ్మురేపింది.ఆర్థిక సంవత్సరం 2020‌‌‌‌‌‌‌‌–21 లో ఏకంగా రూ. 1,02,252 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో ఇండియన్ బ్యాంకింగ్ సెక్టార్‌‌‌‌‌‌‌‌కు రూ. 5 వేల కోట్ల నష్టం రావడాన్ని గమనించాలి. ఈ నెట్‌‌‌‌ ప్రాఫిట్‌‌‌‌లో కూడా రెండు బ్యాంకులకు వచ్చిన లాభాలే 50 శాతంగా ఉన్నాయి. హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్‌‌‌‌కు కిందటి ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ లాభాలొచ్చాయి. ఈ బ్యాంక్‌‌‌‌ రూ. 31,117 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2019–20 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే  బ్యాంక్ నికర లాభం 18 శాతం పెరిగింది.  మొత్తం బ్యాంకింగ్ ఇండస్ట్రీకి వచ్చిన లాభాల్లో హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్ వాటా 30 శాతంగా ఉంది. స్టేట్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌కు 2020–21 లో రూ. 20,410 కోట్ల నికర లాభం వచ్చింది. మొత్తం బ్యాంకింగ్ ఇండస్ట్రీకి వచ్చిన ప్రాఫిట్‌‌‌‌లో ఎస్‌‌‌‌బీఐ వాటా 20 శాతంగా ఉంది. తర్వాత ఐసీఐసీఐ బ్యాంక్ టాప్ పెర్ఫార్మర్‌‌‌‌‌‌‌‌గా నిలిచింది. ఈ బ్యాంక్‌‌‌‌ రూ. 16,193 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. దేశంలోని బ్యాంకింగ్ బిజినెస్‌‌‌‌లో ప్రైవేట్ బ్యాంకుల హవా కొనసాగుతోంది. కోటక్ బ్యాంక్‌‌‌‌, యాక్సిస్ బ్యాంక్‌‌‌‌లు కూడా మంచి లాభాలను ప్రకటించాయి. 

లాభాల్లోకి మారిన ప్రభుత్వ బ్యాంకులు..

గుడ్ న్యూస్ ఏంటంటే, మొత్తం 12 ప్రభుత్వ బ్యాంకుల్లో 10 బ్యాంకులు నికర లాభాలను ప్రకటించాయి. కేవలం పంజాబ్‌‌‌‌ అండ్ సింధ్​ బ్యాంక్‌‌‌‌, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు మాత్రమే 2020–21 కి గాను నష్టాలను ప్రకటించాయి. ప్రైవేట్ సెక్టార్లో అయితే యెస్ బ్యాంక్ ఇంకా నష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. ఈ బ్యాంక్ రూ. 3,462 కోట్ల నష్టాలను ప్రకటించింది.  మొండిబాకీల కోసం ప్రొవిజన్లను ఏర్పాటు చేస్తుండడంతో యెస్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌కు నష్టాలొస్తున్నాయి. కానీ, ఈ బ్యాంకుల నష్టాలు కూడా మునుపటి ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే బాగా తగ్గాయి. బ్యాంకింగ్‌‌‌‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో కేవలం ప్రభుత్వ బ్యాంకులే రూ. 57,832 కోట్ల లాభాన్ని ప్రకటించాయి.  ఇంత పెద్ద మొత్తంలో ప్రాఫిట్స్ రావడానికి ప్రధాన కారణం మొండిబాకీల సమస్యల నుంచి ఇవి బయటపడుతుండడమేనని  ఎనలిస్టులు చెబుతున్నారు. ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ తీసుకున్న నిర్ణయంతో బ్యాంకులు మొండిబాకీల సమస్యల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయని పేర్కొన్నారు. బ్యాంకుల దగ్గరున్న  12 అతిపెద్ద ఎన్‌‌‌‌పీఏ అకౌంట్లను గుర్తించాలని  ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మరో 40 ఎన్‌‌‌‌పీఏ అకౌంట్లను గుర్తించి,  వీటిపై దివాలా చట్టం కింద చర్యలు తీసుకోవడం ప్రారంభించాలని ఆదేశించింది. బ్యాంకులు పక్కన పెట్టిన ఎన్‌‌‌‌పీఏ అకౌంట్ల విలువ ఏకంగా రూ.4 లక్షల కోట్లకు చేరుకుంది కూడా. మార్చి,2020 నాటికి బ్యాంకులన్నీ వాటి ఎన్‌‌‌‌పీఏ అకౌంట్ల కోసం ప్రొవిజన్లను ఏర్పాటు చేశాయి. డబ్బులు తిరిగి రావనుకునే అకౌంట్ల నుంచి అప్పులు రికవరీ అవ్వడంతో  బ్యాంకులు అదనంగా ప్రొవిజన్లను కేటాయించాల్సిన అవసరం రాలేదని, ఇన్‌‌కమ్‌‌ కూడా పెరిగిందని   ఎనలిస్టులు చెబుతున్నారు.

బాండ్ల ఇన్వెస్ట్‌‌‌‌మెంట్స్‌‌‌‌ అమ్మకాలతో లాభాలు..

డెట్‌‌‌‌ మార్కెట్‌‌‌‌లో పెట్టిన ఇన్వెస్ట్‌‌‌‌మెంట్స్ వలన బ్యాంకుల లాభాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా పేర్కొంది. బాండ్‌‌‌‌లలోని ఇన్వెస్ట్‌‌‌‌మెంట్స్‌‌‌‌ను అమ్మడం వలన వీటికి లాభాలు పెరిగాయని తెలిపింది. కాగా, బ్యాంకులు తమ మిగులు ఫండ్స్‌‌‌‌ను గవర్నమెంట్‌‌‌‌ బాండ్లు , కంపెనీలు ఇష్యూ చేసే బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తుంటాయి.  బ్యాంకులకు 2020–21 లో వచ్చిన ట్యాక్స్‌‌‌‌ బిఫోర్‌‌‌‌‌‌‌‌ ప్రాఫిట్‌‌‌‌(పీబీటీ) లో బాండ్లను అమ్మడం వలన వచ్చిన లాభం 75 శాతం ఉందని తెలిపింది.  ఒక్క ఎస్‌‌‌‌బీఐ  మినహాయిస్తే, మిగిలిన ప్రభుత్వ బ్యాంకులకు బాండ్లను సేల్‌‌‌‌ చేయడం వలన వచ్చిన ఫ్రాపిట్సే ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. 2020–21 లో బాండ్లను అమ్మడం వలన బ్యాంకులకు వచ్చిన ప్రాఫిట్స్‌‌‌‌ రూ. 20 వేల కోట్లను మించిందని తెలిపింది.  బ్యాంకులకు  క్యాపిటల్ కోసం ప్రభుత్వం ఇచ్చిన ఫండ్స్‌‌‌‌ కంటే ఈ ప్రాఫిట్స్‌‌‌‌ చాలా ఎక్కువగా ఉన్నాయి. వడ్డీ రేట్లు తక్కువగా ఉండడంతో  ప్రభుత్వ బ్యాంకులు ఇష్యూ చేసిన బాండ్ల వాల్యూ పెరిగింది.  మెర్జింగ్‌‌ పూర్తవ్వడంతో ఇండియన్ బ్యాంక్‌‌కు రూ. 3,005 కోట్లు,  యూనియన్ బ్యాంక్ రూ. 2,905 కోట్ల నికర లాభాలొచ్చాయి.