కామారెడ్డి జిల్లాలో మిల్లింగ్​కు సన్న వడ్లు రెడీ

  • కామారెడ్డి జిల్లాలో 95 వేల మెట్రిక్​ టన్నుల  సన్నవడ్ల కొనుగోలు
  • తొలి విడతలో 17,643 మెట్రిక్​ టన్నుల మిల్లింగ్​కు అనుమతి
  • 46 మిల్లులకు కేటాయింపు
  • రెండు రోజుల్లో మిల్లింగ్​ ప్రారంభం

కామారెడ్డి​, వెలుగు:  కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వం కొనుగోలు చేసిన సన్నవడ్ల మిల్లింగ్​కు అధికారులు అనుమతి ఇచ్చారు. కొనుగోలు చేసిన వడ్లను మిల్లులకు తరలించారు. తొలి విడత మిల్లింగ్​కు ఆదేశాలిచ్చారు.  రెండు రోజుల్లో జిల్లాలో  మిల్లింగ్​ ప్రారంభం కానుంది.  గడువులోగా మిల్లింగ్​అయిన బియ్యాన్ని మిల్లర్లు వెంటనే ప్రభుత్వానికి ఇవ్వాలి.  వానాకాలం సీజన్​కు సంబంధించి 4 .11 లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. 

 ఇందులో  95 వేల మెట్రిక్​ టన్నులు సన్నవడ్లు ఉన్నాయి.   కొనుగోళ్ల  ప్రక్రియ చివరి దశకు చేరింది.  సన్న వడ్లు కొనుగోలుకు ప్రభుత్వం ప్రత్యేకంగా  కేంద్రాలను ఏర్పాటు చేసింది.  ఈ కేంద్రాల్లో విక్రయించిన రైతులకు క్వింటాల్​కు రూ.500 బోనస్​  ప్రభుత్వం చెల్లించింది.   

మిల్లింగ్​కు ఏర్పాట్లు

ఇప్పటి వరకు 95వేల మెట్నిక్​ టన్నుల సన్న వడ్లు వచ్చాయి.  కొనుగోళ్లు చివరి దశలో ఉన్నందున ఇంకా కొంత వచ్చే అవకాశం ఉంది.  సేకరించిన వడ్లను మిల్లింగ్​ చేసేందుకు అధికారులు ఆదేశాలు ఇచ్చారు.  జిల్లాలో 186 రైసు మిల్లులు ఉండగా, ఇందులో  46  పారాబాయిల్డ్ మిల్లులు, 146 రా రైస్​ మిల్లులు ఉన్నాయి.   గతంలో  కేటాయించిన వడ్లకు సంబంధించి సీఎంఆర్​పెండింగ్​లో  ఉండటంతో  30 మిల్లులను బ్లాక్​లిస్టులో పెట్టారు. ఈ మిల్లలకు వడ్లను కేటాయించలేదు. కేవలం 156 మిల్లులకు మాత్రమే వడ్ల దిగుమతికి అనుమతి ఇచ్చారు.  ఇందులో సన్న వడ్లు కోసం  46 మిల్లులు కేటాయించారు.  

Also Read : తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఆర్టీసీ డిపోలు

బ్యాంక్​ గ్యారంటీ షరతు

ఈ సీజన్​ నుంచి  సీఎంఆర్​ కోసం మిల్లులకు కేటాయించిన వడ్లకు ప్రభుత్వం బ్యాంక్​ గ్యారంటీ షరతు విధించింది. రూ.100 బాండ్​పేపర్​పై అగ్రిమెంట్​చేసుకొని, దిగుమతి చేసుకున్న తర్వాత బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలని కోరింది. కేటాయించిన వడ్లను గడువులోగా  సీఎంఆర్​ చేసి ఇవ్వాలి.   

సీఎంఆర్​ ఇవ్వకుండా మిల్లర్లు  అక్రమాలకు పాల్పడితే  బ్యాంక్​ గ్యారంటీ నుంచి  అధికారులు సొమ్ము రికవరీ చేస్తారు.  ఇప్పటి వరకు  95 వేల మెట్రిక్​ టన్నుల సన్న వడ్లు కొనుగోలు చేశారు.  తొలి​విడతలో 17,643 మెట్రిక్​ టన్నుల వడ్లు  మిల్లింగ్​ చేయడానికి సివిల్​ సప్లయ్​ కమిషనర్ పర్మిషన్​ఇచ్చారు.  ఒకటి, రెండు రోజుల్లో  మిల్లింగ్​షూరు కానుంది.  మిల్లింగ్​ అయిన వెంటనే  ప్రభుత్వ గోదాములను తరలించాలి.   ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేటాయించిన సన్న వడ్లను మిల్లింగ్​ చేయించనున్నట్లు  డీఎస్​వో మల్లికార్జున్,  డీఎం రాజేందర్ తెలిపారు.    

లబ్ధిదారులకు పింపిణీ చేసేందుకు..

తెల్లరేషన్​కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం  పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం గతంలో ప్రకటించింది.   కొద్ది నెలల్లోనే  ఇచ్చే అవకాశముంది.   ఇప్పటికే స్కూల్స్​లో మధ్యాహ్నభోజనం, హాస్టల్స్,  అంగన్వాడీ సెంటర్లకు ప్రభుత్వం సన్న బియ్యం సప్లయ్ చేస్తోంది. కాగా,  రేషన్​ లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వానికి సన్నబియ్యం తప్పనిసరి అవసరం .