మళ్లీ పెరగనున్న ఏటీఎం చార్జీలు

మళ్లీ పెరగనున్న ఏటీఎం చార్జీలు
  • ఆగస్టు 1 నుంచి పెంచుకునేందుకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్

న్యూఢిల్లీ: ఏటీఎం కేంద్రాల నిర్వహణ భారంగా మారిందన్న బ్యాంకర్ల ఆందోళన నేపధ్యంలో చార్జీలు పెంచుకునేందుకు ఆర్బీఐ అనుమతిచ్చింది. నెలవారీగా అనుమతిచ్చిన మేరకు ఉచితంగా వాడుకునే అవకాశాన్ని కొనసాగిస్తూ.. అనుమతికి మించి చేసే నగదు లావాదేవీలపై చార్జీలు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఒక్కో బ్యాంకు నెలకు నాలుగు లేదా ఐదుసార్లు ఉచితంగా విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తున్న విషయం తెలిసిందే. అదనపు లావాదేవీకి రూ.20 వరకు చార్జీ వసూలు చేస్తున్నాయి. 
అయితే ప్రజలకు అందుబాటులో ఏటీఎం కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు.. మళ్లీ వాటిని నిర్వహించేందుకు నిర్వహణ ఖర్చులు భారీగా పెరుగుతున్నాయని.. పైగా ఇంటర్ ఛేంజ్ ఫీజులు పెరిగిన నేపధ్యంలో సాధారణ చార్జీలు పెంచుకునే అవకాశం కల్పించాలని బ్యాంకులు కోరుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం డిజిటల్, నెట్ బ్యాంకింగ్ లావాదేవీలు పెరుగుతున్న నేపధ్యంలో ఏటీఎం కేంద్రాల్లో డిపాజిట్ తోపాటు.. విత్ డ్రా మిషన్లను కూడా ఏర్పాటు చేయాల్సి వస్తోంది. దీంతో చాలా మంది కేవలం డిపాజిట్ చేస్తూ.. విత్ర డ్రా మాత్రం నెట్ బ్యాంకింగ్.. ఫోన్ పే ..గూగుల్ పే చేస్తుండడం వల్ల బ్యాంకర్లకు పెద్దగా ఉపయోగం లేకుండా పోతోందన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపధ్యంలో ఈనెల 1వ తేదీ నుంచి చార్జుల పెంచుకునేందుకు అనుమతిచ్చిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా వచ్చే ఆగస్టు 1 నుంచి ఏటీఎం కేంద్రాల్లోనూ ఒక్కో ఆర్ధిక లావాదేవీపై ఇంటర్ ఛేంజ్ ఫీజు రూ.15 నుంచి రూ.17కు.. ఆర్ధికేతర లావాదేవీలపై రూ.5 నుంచి రూ.6కు పెంచుకునేందుకు ఆర్బీఐ బ్యాంకులకు అనుమతిచ్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకలకు కలిపి 90కోట్ల వరకు డెబిట్ కార్డులు వాడుకలో ఉన్నాయి.