నాణ్యమైన భోజనం అందించాలి : ​ సంచిత్​ గంగ్వార్​

  • అడిషనల్ ​కలెక్టర్​ సంచిత్​ గంగ్వార్​

వనపర్తి, వెలుగు: సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకే ప్రభుత్వం మెస్ చార్జీలను 40శాతం పెంచిందని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అడిషనల్​కలెక్టర్ సంచిత్ గంగ్వార్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత శాఖల జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఫుడ్ పాయిజన్ జరగకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులు, వార్డెన్లపై ఉందన్నారు. పప్పులు, ఇతర దినుసుల నాణ్యతను ఖచ్చితంగా పాటించాలని తెలిపారు. ఆర్వో ప్లాంట్ల పనితీరును పరిశీలించాలని, సురక్షిత తాగునీరు అందించాలని సూచించారు. 

వారానికి కనీసం మూడుసార్లు వసతి గృహాలను పరిశీలించాలని స్పష్టం చేశారు. ప్రజాపాలన సంబురాల్లో భాగంగా మంగళవారం ప్రతి గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ ద్వారా నిర్వహించే పనుల్లో ఏదో ఒక కొత్త పనికి శంకుస్థాపన చేయాలని సూచించారు. 2024 మార్చి నుంచి ఇప్పటి వరకు ఉపాధి హామీ పనుల్లో అత్యధిక రోజులు పనిచేసిన వారిని, గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్లకు, హరిత వన మహోత్సవంలో అత్యధిక మొక్కలు నాటిన వ్యక్తిలను గుర్తించి సన్మానించాలన్నారు.

నవంబర్ 26 న సంవిధాన్ దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామ పంచాయతీల్లోని అమృత్ సరోవర్ సైట్ ల వద్ద రాజ్యంగా పీఠిక ప్రమాణం చేయాలని తెలిపారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ ఉమాదేవి, జడ్పీ సీఈవో యాదయ్య, మండల స్పెషల్​ఆఫీసర్లు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.