అమ్రాబాద్, వెలుగు: అడవులు, వన్యప్రాణుల సంరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా గుర్తించాలని అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ సూచించారు. బుధవారం మండలంలోని మన్ననూరు వనమాలిక కాంప్లెక్స్ లో కన్జర్వేటర్ రాంబాబు, డీఎఫ్ వో రోహిత్ గోపిడి, ఎఫ్డీవో రామ్మూర్తితో కలిసి ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవుల విస్తరణ, వన్యప్రాణుల సంరక్షణను సమిష్టి బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. పర్యావరణాన్ని కాపాడుకునేందుకు అడవులను కాపాడాలన్నారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో 39 శాతం అడవులు ఉన్నాయని దీనిని మరింత పెంచడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. నల్లమలలో అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలు సహకరించాలని కోరారు. నల్లమలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.
మహారాష్ట్రలో మాదిరిగా నల్లమలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అపోలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని సందర్శించి పలు సూచనలు చేశారు. ఐసీఐసీఐ ఫౌండేషన్ అందించిన 79 ఫైర్ బ్లోయర్లు, అపోలో ఫౌండేషన్ అందించిన అంబులెన్స్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. చెంచులకు సేవ చేస్తున్న అపోలో ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు ఉపాసనకు ధన్యవాదాలు తెలిపారు. గంగాధరరావు, అంతయ్య పాల్గొన్నారు.