కటక్: ‘‘సీనియర్ ఐపీఎస్ అధికారిణి కనిపించడం లేదు. రెండేళ్లుగా ఆచూకీ లేకుండా పోయారు. విధులకు హాజరు కావడం లేదు. ఎలాంటి సమాచారం ఆమె నుండి లేదు.. ఎక్కడ ఉంటున్నారో తెలియడం లేదు. ఎవరికైనా ఆచూకీ తెలిస్తే సమీప పోలీసు స్టేషన్లకు సమాచారం అందించండి..’’ అంటూ బుధవారం ఒడిశా పత్రికల్లోని ప్రధాన పేజీల్లో వచ్చిన ప్రకటన కలకలం సృష్టించింది.
హ్యుమన్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్ ఐజీగా పనిచేస్తున్న ఐపీఎస్ అధికారిణి భారతి రెండేళ్లుగా విధులకు హాజరు కావడం లేదు. సెలవు కావాలని కూడా అనుమతి తీసుకోలేదు. అసలు ఎక్కడున్నారో తెలియడం లేదు. ఆమె ఇంట్లో నివాసం ఉండడం లేదు. ఫోన్ పనిచేయడం లేదు. మౌఖికంగా కూడా ఎవరికీ చెప్పలేదు. మెయిల్ కు సమాచారం ఇచ్చినా రెస్పాన్స్ లేదు. ఆమె విధులకు హాజరుకాకుండా వెళ్లిపోయారు. నోటీసులు ఇచ్చినా స్పందించడం లేదు. ఆమె హెచ్ఆర్సీ విభాగంలో పనిచేస్తున్న అధికారిణి.. ఆమె విధులకు హాజరుకాకపోవడం వల్ల కేసులు పెండింగ్ పడిపోతున్నాయి.. ఆమెకు పంపిస్తున్న నోటీసులు వెనక్కి వస్తున్నాయి.. అందుకే ఈ పత్రికా ప్రకటన అంటూ వివరణ ఇచ్చారు.
ఐజీ భారతి నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో శాఖాపరంగా చర్యల కోసం నోటీసులు జారీ చేస్తున్నామని ఒడిశా ప్రభుత్వ పోలీసు ప్రధాన కార్యాలయం స్పష్టం చేసింది.
