అయోధ్యలో పునర్నిర్మించిన రామ మందిర ప్రారంభోత్సవం జనవరి 22న జరగబోతోంది. భారత దేశ వ్యాప్తంగా పురాతన రామాలయాలు చాలా ఉన్నాయి. అందులో ప్రధానమైన ఎనిమిది శ్రీరాముడి ఆలయాల గురించి తెలుసుకుందాం..
వాల్మీకి రామాయణం, మొల్ల రామాయణం, కంబ రామాయణం, తుసిదాస్ రామచరిత మానస్ - ఇలా భారతీయ ఇతిహాస కావ్యమైన రామాయణం మూడు వందల వెర్షన్లు ఉనికిలో ఉన్నాయి. కథా కథనం ఎలా ఉన్నా.. రాముడు నెలకొల్పిన విలువలను ఒకేలా ఆయా కావ్యాలు వివరించాయి. జనవరి 22 న అయోధ్యలో నిర్మించిన రామ మందిరం (Ayodhya ram mandir)లో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుకను జరుపుకోవడానికి భారతీయులు సన్నద్ధమవుతున్నారు.
అయోధ్యలో..
అయోధ్య (Ayodhya)లో కొత్తగా నిర్మించిన రామ మందిరంలో బాల రాముడి 'ప్రాణ ప్రతిష్ఠ' కార్యక్రమం సమీపిస్తున్న తరుణంలో.. భారతదేశంలో అంతగా ప్రసిద్ధి చెందిన ఎనిమిది రామాలయాల వివరాలు ఇక్కడ ఉంది. వాటిలో ఆంధ్ర ప్రదేశ్ లోని ఒంటిమిట్ట రామాలయం కూడా ఉంది.
కోదండరామ ఆలయం -... ఒంటిమిట్ట, ఆంధ్ర ప్రదేశ్
కోదండరామ దేవాలయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, కడప జిల్లా, వొంటిమిట్ట మండలం, వొంటిమిట్ట పట్టణంలో ఉంది. పూర్వ నిషాద వంశానికి చెందిన దొంగలు వొంతుడు, మిట్టుడు రామ భక్తులుగా మారి ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం వారి భక్తికి నిదర్శనంగా నిలుస్తుంది.
సీతారామ చంద్రస్వామి దేవస్థానం, భద్రాచలం, తెలంగాణ
సీతారామ చంద్రస్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా భధ్రాచలం మండలం భద్రాచలం పట్టణంలో ఉంది. 17 వ శతాబ్దం నాటి సంకీర్తనాచార్యులు శ్రీరామదాసుగా పేరు పొందిన కంచర్ల గోపన్న జీవితంతో ఈ ఆలయ నిర్మాణం ముడిపడి ఉంది. 17 వ శతాబ్దం రెండవ భాగంలో కంచర్ల గోపన్న భద్రాచలం తహశీల్దార్ గా ఉన్నపుడు ప్రభుత్వానికి తెలియకుండా ఈ ఆలయ నిర్మాణం కోసం ప్రభుత్వ ఖజానాకు సంబంధించిన ధనాన్ని ఉపయోగించారని గోల్కొండ లోని ఒక చెరసాలలో ఇతనిని బంధించారు. కంచర్ల గోపన్న భక్తికి మెచ్చిన శ్రీరాముడు చెరసాల నుండి విడిపించేందుకు గోల్కొండ సంస్థానాదీశుడైన సుల్తాన్ కు దివ్య రూపంలో కనిపించి, గోపన్నను విడుదల చేయమని ఆలయ నిర్మాణానికి వెచ్చించిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సొమ్మును చెల్లించాడని చారిత్రక కథనం. బందీఖానా నుండి విడుదలైన గోపన్న శ్రీరాముని కీర్తిస్తూ తెలుగులో అనేక సంకీర్తనలను రచించాడు. అప్పటి నుండి గోపన్నను రామదాసు అని పిలుస్తుండేవారు. భద్రాచలం, విజయనగరం ప్రాంతాలకు రామాయణంతో దగ్గర సంబంధమున్నట్లు రామాయణ గ్రంథాల ద్వారా తెలుస్తుంది
ఎరి-కథా రామర్ ఆలయం- ...మధురాంతకం, తమిళనాడు
తమిళనాడులోని మధురాంతకంలో ఉన్న ఎరి-కథా రామర్ ఆలయం రామాయణ కథనంలో ప్రాముఖ్యతను కలిగి ఉంది. లంకలో రావణాసురుడిని వధించిన తరువాత, శ్రీరాముడు, సీతా లక్ష్మణులతో కలిసి పుష్పక విమానంలో అయోధ్యకు తిరిగి వెళ్ళే సమయంలో మధురాంతకంలో కొద్ది సేపు ఆగారని భక్తులు విశ్వసిస్తారు.
రామ్ తీర్థ్ ఆలయం...- అమృత్ సర్, పంజాబ్
పంజాబ్ లోని అమృత్ సర్ లో ఉన్న రామ్ తీరథ్ ఆలయం రాముడు, సీత కుమారులైన లవ, కుశుల జననానికి సంబంధించినది. ఈ ఆలయం దాని పురాతన బావికి ప్రసిద్ధి చెందింది. ఆ బావిలోని నీటికి ఔషధ శక్తులు ఉన్నాయని నమ్ముతారు. గర్భిణిగా వచ్చిన సీతాదేవికి వాల్మీకి మహర్షి ఆశ్రయం కల్పించిన ప్రదేశం కూడా ఇదేనని విశ్వసిస్తారు.
శ్రీరామస్వామి దేవాలయం... త్రిస్సూర్ జిల్లా , త్రిప్రయార్ ,కేరళ
కేరళలోని త్రిస్సూర్ జిల్లా, త్రి ప్రయార్ లో ఉన్న త్రిప్రయార్ శ్రీ రామస్వామి దేవాలయంలో కృష్ణుడు ఆరాధించిన శ్రీరాముడి విగ్రహం ఉంది. దశరథ మహారాజు నలుగురు కుమారులైన రామ, లక్ష్మణ, భరత, శతృఘ్నులకు ఉన్న నాలుగు దేవాలయాల్లో ఈ ఆలయం మొదటిది.
కోదండ రామాలయం-... చిక్ మగళూరు, కర్నాటక
కర్నాటకలోని చిక్కమగళూరు జిల్లా హీరేమగళూరులో కొలువై ఉన్న కోదండరామస్వామి ఆలయం స్కంద పురాణం లో ఉన్న ఒక విశిష్ట సంఘటనతో ముడిపడి ఉంది. స్కంద పురాణం ప్రకారం, శ్రీరాముడు సీతామాతను వివాహం చేసుకున్నప్పటి భంగిమలో పరశురాముడికి దర్శనం ఇస్తాడు.
రామ్ రాజా టెంపుల్... - ఓర్చా, మధ్యప్రదేశ్
మధ్యప్రదేశ్ లోని ఓర్చాలో ఉన్న రామ్ రాజా టెంపుల్, రాజ ప్రసాదం సెట్టింగ్ లో రాముడిని రాజుగా ఆరాధించే ఏకైక ఆలయంగా ప్రత్యేకమైనది. ఇక్కడ శ్రీరాముడు మహారాజుగా దర్శనమిస్తాడు. మహారాజులకు ప్రతీ రోజు ఇచ్చే గార్డ్ ఆఫ్ హానర్ కూడా ఇక్కడ నిర్వహిస్తారు. ఈ ఆలయంలోని శ్రీరాముడి విగ్రహం పద్మాసనంలో కూర్చొని ఖడ్గం, కవచం పట్టుకొని ఉన్నట్టు కనిపిస్తుంది.
శ్రీ విజయరాఘవ పెరుమాళ్ ఆలయం- ...కాంచీపురం జిల్లా, తిరుప్పుకుళి, తమిళనాడు
తమిళనాడు, కాంచీపురం జిల్లా, తిరుప్పుకుళిలో ఉన్న ఈ ఆలయం విష్ణువుకు అంకితం చేయబడిన 108 దివ్యదేశాలలో ఒకటి. గర్భగుడి లోపల, విజయరాఘవ పెరుమాళ్ ఒడిలో జటాయువును చిత్రీకరించారు. ఈ ప్రదేశంలోనే శ్రీరాముడు తనకు సీతాదేవి వివరాలను చెప్పిన జటాయువుకు అంతిమ సంస్కారాలు చేసినట్లుగా భక్తులు విశ్వసిస్తారు.