రెండు గ్రూపులుగా విడిపోనున్న గోద్రెజ్​ 

రెండు గ్రూపులుగా విడిపోనున్న గోద్రెజ్​ 

న్యూఢిల్లీ: దేశంలో పేరొందిన పారిశ్రామిక కుటుంబాలలో ఒకటయిన గోద్రెజ్​ గ్రూప్​ త్వరలో విడిపోనుందని చెబుతున్నారు. రూ. 30 వేల కోట్ల వ్యాపారాలున్న ఈ గ్రూప్​ సబ్బులు, హోమ్​ అప్లయెన్సెస్, రియల్​ ఎస్టేట్​ రంగాలలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. గోద్రెజ్​ గ్రూప్​కు 124 ఏళ్ల హిస్టరీ ఉంది. ప్రస్తుతం ఆది గోద్రెజ్​ (79) గ్రూప్​కు చైర్మన్​​గా ఉన్నారు. గోద్రెజ్​ ఇండస్ట్రీస్​, గోద్రెజ్​ ఆగ్రోవెట్​ కంపెనీలకు ఆయన సోదరుడు నాదిర్​ గోద్రెజ్​చైర్మన్​. వారి కజిన్​ జెంషెడ్​ ఎన్​ గోద్రెజ్​ మరో కంపెనీ గోద్రెజ్​ అండ్​ బాయ్​స్​ మాన్యుఫాక్చరింగ్​ కంపెనీకి చైర్మన్​గా ఉన్నారు.

లాయర్​ నుంచి ఎంట్రప్రెనూర్​గా మారిన అర్దేషిర్​ గోద్రెజ్​ 1897లో గోద్రెజ్​ గ్రూప్​ నెలకొల్పారు. కొన్ని వ్యాపారాలలో ఆయన ఫెయిలయినా తాళం కప్పల (లాక్స్​) వ్యాపారంతో ఆ తర్వాత సక్సెసయ్యారు.  తాజా రిపోర్టుల ప్రకారం గోద్రెజ్​ రెండు గ్రూప్​లుగా విడిపోనుంది. ఆది, నాదిర్​లు ఒక గ్రూప్​గా, జెంషెడ్​, స్మితా, క్రిష్నలు మరో గ్రూప్​గా విడిపోనున్నారు. గత కొన్నేళ్లుగా ఫ్యామిలీ వ్యాపారాన్ని మార్చాలని ప్రయత్నిస్తున్నామని గోద్రెజ్​ ఫ్యామిలీ ఒక జాయింట్​ ప్రకటనలో తెలిపింది. ఇంతకు మించిన వివరాలను వేటినీ వెల్లడించలేదు. ప్రముఖ బ్యాంకర్లు నిమేష్​ కంపాని, ఉదయ్​ కొటక్​లతోపాటు, లీగల్​ నిపుణులూ కుటుంబ విభజన స్మూత్​గా జరిగేలా చొరవ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గోద్రెజ్​ గ్రూప్​లోని 23 శాతం ప్రమోటర్​ హోల్డింగ్​ ట్రస్టుల చేతిలో ఉంది.