మధ్యప్రదేశ్ లో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో సామాన్యులకు కొత్త కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. కరెంట్ ముట్టుకోకుండానే..విద్యుత్ బిల్లులను చూస్తేనే షాక్ కొడుతున్నాయి. గ్వాలియర్ శివా విహార్ కాలనీలో నివాసముంటున్న ప్రియాంక గుప్తా ఇంటికి ఏకంగా 3,419 కోట్ల రూపాయలకుపైగా కరెంటు బిల్లు వచ్చింది. దీన్ని చూసిన ఆమె తండ్రి రాజేంద్ర ప్రసాద్ గుప్తాకు కరెంట్ షాక్ కొట్టినంత పనైయ్యింది. విద్యుత్ బిల్లును చూసి ఆయన స్పృహతప్పి కిందపడిపోయారు. తీవ్ర అస్వస్థతకు గురైన అతడిని ఆస్పత్రికి తరలించారు.
3419 करोड़ रु. का बिजली बिल, ग्वालियर में एक परिवार को ये करंट बिजली कंपनी ने दिया, शिकायत हुई बिल ठीक हुआ और बिजली कंपनी का एक कर्मचारी बर्खास्त, 2 पर विभागीय कार्रवाई pic.twitter.com/VGMEOCsi2V
— Anurag Dwary (@Anurag_Dwary) July 27, 2022
జులై నెల గృహ వినియోగానికి సంబంధించిన విద్యుత్ బిల్లులో మూడు వేల కోట్లకు పైగా బిల్ వేయడాన్ని చూసిన తన తండ్రి షాక్ కు గురయ్యారని ప్రియాంక గుప్తా తెలిపారు. వెంటనే స్పందించిన అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. సాఫ్ట్ వేర్ లో వచ్చిన సాంకేతిక లోపంతో 3 వేలకు పైగా విద్యుత్ బిల్లు వచ్చిందని చెప్పారు. ప్రియాంకా గుప్తా కుటుంబానికి ఉపశమనం కలిగించేలా 1,300 రూపాయల సరిదిద్దిన మరో బిల్లును జారీ చేశారు. దీంతో ఆ కుటుంబం ఊపిరి పీల్చుకుంది. ఈ విషయం తెలుసుకున్న రాజేంద్రప్రసాద్ గుప్తా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. భారీ విద్యుత్ బిల్లు జారీ చేసిన సంబంధిత ఉద్యోగులపై ఉన్నతాధికారులు వేటు వేశారు. విద్యుత్ బిల్లును జారీ చేసిన సంబంధిత సిబ్బందిని,విద్యుత్ సంస్థ అసిస్టెంట్ రెవెన్యూ అధికారిని సస్పెండ్ చేసింది. ఏరియా జూనియర్ ఇంజినీర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసింది.
